Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డైరెక్టర్ శంకర్ కు టికెట్ ఇవ్వద్దంటున్నారు!

సామాజిక చిత్రాల దర్శకుడు, ‘జై బోలో తెలంగాణ’ చిత్రం ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన దర్శకుడు ఎన్.శంకర్ కు టికెట్ వచ్చేలా కనపడటం లేదు. ఆయన పేరును మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ పరిశీలించింది. ఇందుకు సంబంధించి రాహుల్ టీమ్ శంకర్ కు ఈ విషయాన్ని తెలిపి అంగీకారం కూడా తీసుకుంది. ఇక, శంకర్ పేరును అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని అంతా అనుకుంటున్న సమయంలో నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుపడుతున్నారు. తమ మాటను కాదని శంకర్ కు సీటిస్తే ఎట్టి పరిస్థితు్ల్లోనూ తాము సహకరించేది లేదని కొందరు నేతలు అధిష్ఠానానికి తెగేసి చెప్పారు.

శంకర్ సొంత నియోజకవర్గం కూడా మిర్యాలగూడ కావడంతో ఆయన అక్కడి నుంచే బరిలోకి దిగాలని భావించారు. అయితే, ఎన్. శంకర్ ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరుతున్నట్టు ప్రకటించలేదు. ఒక దశలో టీఆర్ఎస్ సైతం శంకర్ కోరితే టికెట్ ఇచ్చేందుకు సిద్ధపడింది. అలాగే, కాంగ్రెస్ కూడా ముందుకొచ్చింది. ఈలోగా టీఆర్ఎస్ తన అభ్యర్థుల ప్రకటన లాంఛనాన్ని పూర్తిచేయడంతో కాంగ్రెస్ నుంచి శంకర్ కు టికెట్ వస్తుందని ఆయన సన్నిహితులంతా అనుకున్నారు. ఈలోగా నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి శంకర్ పేరును అడ్డుకుని పెండింగులో పెట్టించినట్టు తెలుస్తోంది. శంకర్ కు టికెట్ ఇవ్వొద్దు, జానారెడ్డి ఎవరి పేరు చెబితే వారికిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని ఏకంగా ఏఐసీసీ నాయకత్వానికి లేఖ రాసారని తెలుస్తోంది. వాస్తవానికి జానారెడ్డి తన కొడుకు రఘువీర్ రెడ్డి రాజకీయ అరంగేట్రం కోసం మిర్యాలగూడ స్థానాన్ని అనువైనదిగా భావించారు. తీరా జిల్లా నేతలు అడ్డుతగలడంతో అదే రాహుల్ టీమ్ తిరిగి శంకర్ కు విషయం చేరవేసి, ఏం చేద్దామంటూ కొత్త ప్రశ్నలు ఆయన ముందుంచింది. ఇక జిల్లా కాంగ్రెస్ నేతల తీరు తెలుసుకున్న తెలంగాణ వాదులు స్థానిక కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News